కర్మన్ఘాట్ ఆలయ భూముల్లో ఇండ్ల స్వాధీనం..బందోబస్తు మధ్య 11 ఇండ్లను ఖాళీ చేయించిన అధికారులు

కర్మన్ఘాట్ ఆలయ భూముల్లో ఇండ్ల స్వాధీనం..బందోబస్తు మధ్య 11 ఇండ్లను ఖాళీ చేయించిన అధికారులు
  • కోర్టు ఆదేశాలున్నాయన్న ఆఫీసర్లు ..అడ్డుకున్న బాధితులు 

దిల్​సుఖ్ నగర్, వెలుగు: కర్మన్‌‌ఘాట్ హనుమాన్ ఆలయ భూముల్లో నిర్మించిన ఇండ్లను దేవాదాయ శాఖ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. కర్మన్ ఘాట్ టెంపుల్​దత్తత ఆలయమైన బన్సురీవాలా కృష్ణ మందిరానికి సైదాబాద్ గ్రామ సర్వే నంబరు 110లో 2.11 ఎకరాల భూమి ఉంది. ఇందులో 30 ఏండ్ల కింద 21 మంది ఇండ్లు నిర్మించుకున్నారు.

ఇందులో 10 మంది ఆలయానికి అద్దె కడుతున్నారు. మరో 11 మంది తమ సొంత ఇండ్లు అని ప్రకటించుకుని రెంట్​కట్టడం లేదని, దీనిపై ఎండోమెంట్ కోర్టు ట్రిబ్యునల్ కు వెళ్లగా తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శేఖర్, ఈవో లావణ్య, ఆలయ చైర్మన్ ఈదులకంటి సత్యనారాయణ  తెలిపారు. అక్రమంగా ఉంటున్నవారికి 3 నెలల క్రితమే నోటీసులు ఇచ్చామని, గడువు తీరడంతో 11 ఇండ్లను ఖాళీ చేయించి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. 

తెల్లవారుజామున ఉద్రిక్తత పరిస్థితి

దేవాదాయ శాఖ అధికారులు ఇండ్లను ఖాళీ చేయించడానికి తెల్లవారుజామునే ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తుతో రావడంతో అక్కడివారు అడ్డుకున్నారు. తాము 35 ఏండ్లుగా ఇక్కడ ఉంటున్నామని, ఉన్నఫళంగా ఖాళీ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా గడువు ఉందని, తాము కోర్టు తీర్పును అప్పీల్​చేశామని, అప్పటివరకు ఆగకుండా తమను గూడు లేని వారిని చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండోమెంట్ భూమి అని వాదిస్తున్న అధికారులు ఇండ్ల నిర్మాణానికి పర్మిషన్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.